ఎన్టీఆర్‌కు ప్రేమకథలు… ఆ సినిమాతో ఈ డౌట్ తీరిపోయింది…!

తెలుగు చిత్ర సీమలో తనకంటూ.. ప్రత్యేక స్థానం పదిలం చేసుకున్న విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు.. అన్నగారు నందమూరి తారకరామారావు సినిమాలను పరిశీలిస్తే.. ఆయన ఎక్కువగా సబ్జెక్ట్ ఓరియెంటెడ్ సినిమాలకే పరిమితం అయ్యారు. రొమాంటిక్ లవ్ స్టోరీలు ఆయనన పెట్టి తీసిన సందర్భాలు చాలా తక్కువ. ముఖ్యంగా బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో అయితే.. ఒక్క మల్లీశ్వరి తప్ప.. ఏదీ కనిపించదు.
పాతాళ భైరవి సినిమాలో లవ్ కోసం.. త్యాగం చేసే సీన్లు ఉన్నా.. పూర్తిగా ప్రేమ కథా రసరమ్య చిత్రం అయితే కాదు. అదే దేవదాస్ సినిమా మాత్రం పూర్తిగా ప్రేమ కథా చిత్రమే.. ఇందులో సాహసాలు.. ఫైట్లు వంటివి ఏమీ ఉండవు. ఇలాంటి పాత్రలకు అన్నగారిని ఎంచుకునేవారు కాదు. ఇదే విషయంపై అప్పటి దిగ్గజ దర్శకులు కేవీ రెడ్డి, బీఎన్ రెడ్డిల మధ్య ఆసక్తికర చర్చ కూడా సాగేది.
ఈ క్రమంలో కేవీ రెడ్డి సుతరామూ.. అన్నగారిని లవ్ ఓరియెంటెడ్ సినిమాలకు అంగీకరించేవారు కాదు. రామారావ్ సెంటిమెంటు సినిమాలకే నప్పుతాడు. నీకు లవ్ సినిమాలు కూడా కావాలంటే.. నాగేశ్వర్రావ్‌ను తీసుకో.. అని సలహా ఇచ్చేవారట. ఈ క్రమంలోనే అనేక సినిమాల్లో అక్కినేని నటించారు. అయితే.. ప్రేమ, సాహసం, ఫైట్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎన్టీఆర్ ఉండేవారు.
ఇలాంటి వాటిలో లక్ష్మీకటాక్షం(విఠలాచార్య) ప్రధానమైంది. మొత్తానికి అన్నగారిపై ఈ ముద్రను తుడిచేందుకు ప్రయత్నించిన సినిమా ఆరాధన. కానీ, అది పాటల పరంగా హిట్ కొట్టింది కానీ.. సినిమా పరంగా కాదనే వాదన ఉంది.