లోకేష్ మంగళగిరితో పాటు.. అక్కడ నుంచి కూడా పోటీకి రెడీనా..!

టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్.. వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్న విషయం తెలిసిందే. ఒక్క ఆయన గెలవడమే కాకుండా.. పార్టీని కూడా అధికారంలోకి తీసుకువ చ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే యువగళం పేరుతో ఆయన పాదయాత్ర నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి పార్టీ ఇప్పటికే సన్నద్ధమైంది.
ఇదిలావుంటే.. వచ్చే ఎన్నికల్లో తాను మంగళగిరి నుంచి పోటీ చేయడం ఖాయమని చెప్పిన లోకేష్.. ఇప్పటికే ఇక్కడ తిరుగుతున్నారు. ప్రతి ఇంటికి తిరుగుతున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వారికి వివరిస్తున్నారు. ఈ క్రమంలో తనను గెలిపిస్తే.. చేసే కార్యక్రమాలను కూడా ఆయన వివరిస్తున్నారు. పేదలకు, చేతి వృత్తి చేసుకుని జీవించేవారికి ఆయన ఆర్థిక సాయం చేస్తున్నారు.
అయితే.. ఇప్పుడు లోకేష్ వ్యూహం మారుతోందని తెలుస్తోంది. వచ్చే ఎన్నికలు టఫ్‌గా ఉన్న నేపథ్యంలో మంగళగిరిలో మాత్రమే కాకుండా తన సొంత ప్రాంతం అయిన రాయలసీమలోని మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీకి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సమీకరణల పరంగా మంగళగిరి టీడీపీకి అంత సానుకూలం కాదు. అందులోనూ గత ఎన్నికల్లో అక్కడ లోకేష్ స్వల్ప తేడాతో ఓడిపోయారు.
అయితే ఓడిన చోటే గెలవాలన్న పంతంతో ఉన్న లోకేష్ మంగళగిరిలో గెలిచి తీరాలని పంతంతో ఉన్నారు. అలాగే రాయలసీమలో నారా ఫ్యామిలీకి పట్టులేదన్న విమర్శను తిప్పికొట్టేందుకు ఈ సారి సీమ నుంచి కూడా బరిలోకి దిగే ఏర్పాట్లలో యువనేత ఉన్నాడు. ప్రస్తుతం ఉన్న అంచనాల మేరకు.. జనసేనతో పొత్తు లేకపోతే.. లోకేష్ తిరుపతి నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది.
ఒకవేళ పొత్తు ఉంటే.. మరో కీలక నియోజకవర్గాన్ని ఎంచుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా మంగళగిరి ఒక్కటే కాకుండా.. మరో నియోజకవర్గాన్ని కూడా ఎంచుకుంటున్నారని అంటున్నారు పరిశీలకులు. గతంలో తిరుపతి నుంచి ఎన్టీఆర్ కూడా పోటీ చేసి గెలిచారు. అక్కడ పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. అందుకే అటు తాను ఓడిన మంగళగిరితో పాటు ఇటు తిరుపతిలో గెలిచి తానేంటో సత్తా చాటుకోవాలన్న సంకల్పం లోకేష్‌లో బలంగా ఉందట.